16 మార్చి, 2010

సందర్భం

ఏ కొమ్మ పై వాలాలో తెలియక-
కోయిల తికమక పడుతుంది.

ఏ పాట పాడాలో తెలియక,
ఆత్రుత పడుతుంది.

వఛ్చే వసంతం ఊహకందక
బెరుకు దుప్పట్లలోనే ఉన్నారు-సామాన్య జనం.

ఏది ఏమైనా-
పంచమం కోసం
సవరించుకున్న కోయిల గొంతులో,

పిందె కట్టాల్సిన పూత
అర్ధంతరంగా రాలడం చూసి-
వెల్లువెత్తింది,
శోకరస గీతం.

23 నవంబర్, 2009

రుధిర రోదనం

ఒకప్పుడు
నన్ను చూస్తే
నాకే గర్వం,
శీతనగాన్నే
సవాల్ చేసే
సాహసం!

నేడు
నన్ను చూస్తే
నాకే అయోమయం,
నాపై నాకే
అనుమానం!

ఇది
సిద్ధాంతాలకు
సంధి కాలం,
చే గువేరా స్మ్రుతికి
చేటుకాలం!

ఎటూ కదలలేక కుళ్ళుతున్నా.
ఎటూ కదలలేక కుళ్ళుతున్నా,
ప్రభూ!
నన్ను విముక్తం చెయ్!

నన్ను విముక్తం చెయ్,
నీ బతుకు
శిలువ బంధనాలు
తొలగిస్తా!

25 ఫిబ్రవరి, 2008

నేటి నిజం

తాజ మహల్లో,

ముంతాజ్ మహారాణీ గారి

ఆత్మ మూలుగుతోంది!

షాహ్ జాహ్ షాజహను గారికి

'షా' చెప్పబడింది!

ఇరవై వేల రక్తసిక్త హస్తాలు,

కర కరాళ నృత్యం చేస్తున్నవి!!

28 జనవరి, 2008

స్పృహ

కళ్ళే కాదు,
కలాలూ కలలు కంటాయ్.
నెగళ్ళే కాదు,
బయళ్ళూ జ్వలిస్తాయ్.
మల్లెలే కాదు,
మెదళ్ళూ వికసిస్తాయ్.
మెదళ్ళూ వికసిస్తాయ్,
పిడికిళ్ళకు,
అటూ ఇటూ నిలుస్తాయ్.